మహిళా శిశు సంక్షేమ శాఖ, స్కోప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా చేపట్టిన 'బాల్య వివాహ విముక్తా భారత్' ప్రచార రథం మండల పరిధిలో పర్యటించింది. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మహిళా సాధికారత ప్రతినిధులు పవిత్ర, హేమలత పిలుపునిచ్చారు.
ప్రచార రథం పలు గ్రామాలలో పర్యటించి, బాల్య వివాహాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించింది. బాల్య వివాహం చట్ట విరుద్ధమని, ఇది బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.
ఈ సందర్భంగా, గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కు సమాచారం అందించాలని సూచించారు. బాధ్యతాయుతమైన పౌర సమాజం బాల్య వివాహాల నిర్మూలనలో కీలక పాత్ర పోషించాలని కోరారు.
ఈ అవగాహన కార్యక్రమం ప్రజలలో చైతన్యం తీసుకువస్తుందని, తద్వారా బాల్య వివాహాలను అరికట్టవచ్చని ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ దురాచారాన్ని రూపుమాపవచ్చని వారు నొక్కి చెప్పారు.








