బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం కుమ్మక్కైందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ ఆరోపణ
ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో నిర్వహించిన చలో లోక్‌భవన్ కార్యక్రమంలో భాగంగా ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఈసీ జ్ఞానేశ్వర్ ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సీఈసీ చేస్తున్న తప్పులకు భవిష్యత్‌లో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందనే భయంతోనే చట్టాలను మార్చారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీసీఈసీ కలిసి ఓటు చోరీకి పాల్పడుతున్నాయనే ఆరోపణలు దేశ ప్రజలకు అర్థమయ్యాయని పేర్కొన్నారు. కోట్లాది ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్లేనని అన్నారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.









