అచ్చంపేట, 2026-11-26
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కమిషన్కు లంబాడా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే చైర్మన్గా నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. లంబాడా సోదరుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత తమ ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగులో సీఎం పర్యటించారు. ముందుగా మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి.. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు, రూ.15 కోట్లతో హరిత హోటల్ నిర్మాణానికి, మొత్తం రూ.450 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజానికి సంత్ సేవాలాల్ గొప్ప సన్మార్గాన్ని చూపారని, ఆదర్శమూర్తిగా జీవించారని కొనియాడారు. దేశవ్యాప్తంగా వేర్వేరు పేర్లతో పిలువబడుతున్న లంబాడాలను మిగతా అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే వారి అభివృద్ధికి అండగా నిలిచిందని అన్నారు. బ్రిటీషర్లను వణికించడంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలోనూ లంబాడాలు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. బలహీన వర్గాలుగా ఉన్న లంబాడీలను ఎస్టీలుగా గుర్తించింది కాంగ్రెస్ పార్టీయేనని, దున్నేవాడికే భూమి నినాదంతో ఇందిరమ్మ 10 లక్షల ఎకరాలకు పైగా భూములు, పోడు భూములకు పట్టాలు పంచారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశామని చెబుతూ, లంబాడాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
అచ్చంపేటలో బ్రిడ్జి నిర్మాణం, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. డిండి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను అచ్చంపేట, దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు అందించే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.







